Oct 6, 2010

పంచారామ క్షేత్రములు - అమరారామము

అమరారామము


అమరేంద్రపురికి నెనయగు నమరావతి యందు వెలసి యార్తుల కమర
ద్రుమమై కోరిక లిచ్చెడి యమరేశ్వరు గొల్వహనన జాఘు మడంగున్
~ డా.దివాకర్ల వేఙ్కటావధాని ~

అమరారామము కృష్ణానదీతీరములో వెలసిన మహా మహిమాన్వితమైన శైవక్షేత్రము. పంచారామములలో మొట్టమొదటిదైన ఈ క్షేత్రము గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలము, అమరావతి పట్టణముగా భాసిల్లుతున్నది. 
ఇచ్చట ప్రధాన దేవత అమరేశ్వరుడు. అమ్మవారు చాముండేశ్వరి.

తారకాసురిని కంఠం నుండి చేదించబడిన శివుని అమృతలింగము ఐదు శకలాలుగా
విడిపోగా దానిలో పెద్దది మొట్టమొదటి శకలము ఈ క్షేత్రములో పడగా దానిని ఇచ్చట అమరాథిపతి
ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినందున ఈ స్వామి అమరేశ్వరునిగా ప్రసిధ్ధినొందెను.

మహోన్నతమైన అమరేశ్వరాలయము కృష్ణానది ప్రవాహము పడమట దిక్కునుండి
తూర్పుదిక్కునకు ప్రవహిస్తూ ఉత్తర దక్షిణములుగా మలుపు తిరిగినచోట నిర్మించబడినది.
నదులు వాటి ప్రవాహ మార్గగతిలో ఎచ్చట మలుపు తిరిగి ప్రవహిస్తాయో ఆ ప్రదేశాలు
ఆలయ నిర్మాణానికి పవిత్ర స్థలముగా పరిగణింపబడతాయి.       

ఇదే విధముగా త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిధ్ధినొందిన కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయము వెలసిన దివ్యక్షేత్రము కాళేశ్వరములో కూడా గోదావరి నది పరీవాహక ప్రదేశమందు ప్రాణహిత (పెనుగంగ) గోదావరి మరియు సరస్వతి నది (అంతర్వాహిని) త్రివేణీ సంగమ ప్రదేశానికి దక్షిణముగా గోదావరి నది అర్థ చంద్రాకారములో ప్రవహించుట వలన ఏర్పడిన కోణములో నిర్మింపబడినందున ప్రసిధ్ధి చెందినది.  

ఈ క్షేత్ర మహత్యము స్కాంద, బ్రహ్మ, పద్మ పురాణములలో వివరించినట్లు తెలియుచున్నది.

స్థల పురాణము:-
తారకాసురుని వధ జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠములోని శివలింగమును ఛేధించగా ఏర్పడిన ఐదు శకలాలలో పెద్దది మొదటి శకలము పడినచోట ఈ అమరారామము. ఆకాశాన్ని అంటుతున్న శివలింగాన్ని ప్రతిష్టించటము  గురించి ఇంద్రుడు దేవగురువైన బృహస్పతితో కలసి వెళతాడు. అప్పటికే అది పెరిగి పోతుండడము చూచిన ఇంద్రుడు ఆధ్యంతములు తెలుసుకొను వీలులేని ఈ అమరేశ్వరస్వామి లింగమును ఎట్లు ప్రతిష్టించాలని దేవగురువైన బృహస్పతితో తన సందేహము వ్యక్తము చేయగా

అశ్విన్య ససితే పక్షే దశమీ సర్వ సిధ్ధిదా
త్వత్పుణ్యా త్సైవ సంప్రాప్తాది నేస్మిన్ సురనాయక
విజయాభ్య ముహూర్తేస్మిన్ స్థాప్యైనం శివనర్చతు
ఏవం కృతేషు భవతాం విజయ స్సర్వకాలికః

అంటూ బృహస్పతి సర్వ కార్యసిధ్ధి నిచ్చునటువంటి ఆస్వయుజ శుధ్ధ దశమి విజయ ముహూర్తములో శివలింగ ప్రతిష్ఠచేసి అమరేశ్వరస్వామిగా నామకరణము చేస్తారు. ఇంద్రాది దేవతలు స్వామిని మారేడు దళములు, పుష్పములతోను శివలింగమునకు పూజ చెస్తారు. ఆనాటికి కృష్ణానది ఉద్భవించలేదు. అయితే అచ్చట కేతెంచిన రాక్షస గురువు శుక్రాచార్యుడు అవహేళనచేస్తూ "రాబోయే కాలములో సహ్యపర్వత ప్రాంతము నుండి పుట్టబోయే విష్ణు స్వరూపమైన కృష్ణానది ఈ ప్రదేశము నుండే ప్రవహించును గనుక అప్పుడీ అమరేశ్వరుడు నదీ ప్రవాహ వేగానికి నిలువ గల్గునా?" అని ఆక్షేపిస్తాడు.             

అందులకు దేవగురువు చెప్పిన సమాధానం:- "ఈ ప్రదేశమునందే క్రౌంచ పర్వతము పాతాళము వరకు ఇమిడి ఉన్నది. కావున సర్వఙ్ఞుడైన పరమేశ్వరుడు లింగమూర్తియై ఇచ్చట వృధ్ధిపొందును. అందువల్ల కృష్ణానది స్వామికి వినమ్రయై క్రౌంచగిరిని చుట్టుకొని దాటివెళ్ళిపోవును. అందువలన స్వామికిగాని, ఈ అమరేశ్వరాలయానికిగాని వచ్చే ప్రమాదమేమీలేదు" అని చెప్పగా శుక్రాచార్యుడు మరి తిరిగి మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. తదనంతరము దేవతలు బృహస్పతి ఆదేశానుసారము అంబిక మున్నగు పరివార దేవతలను ప్రతిష్ఠించెను.

"విధినా గురుణోక్తేన కేచిదన్యే సురోత్తమాః
దేవతాంతరము నీర్తీశ్చస్థాపయన్నంబికాదికాః
సే స్వైవ పరివారహి స్థాపితా స్థావిరే జిరే"

ఆనాటి నుండి దేవతలంతా శత్రు సంహారానికి తగిన బలము సంపాదించుకొనుటకు ఈ అమరేశ్వరస్వామిని పూజిస్తూ కొంత కాలము ఈ క్షేత్రములోనే నివసించారు. అమరులు నివసించిన ప్రాంతము గనుక అమరావతి అని పేరు సార్థకమైనది. 

తీర్థ ప్రాశస్త్యము - క్షేత్ర మహత్యము
కృష్ణానది ప్రవాహము వలననే ఈ అమరావతి క్షేత్రము ఒక ప్రసిధ్ధినొందిన తీర్థరాజముగా భాసిల్లుచున్నది. ప్రళయాంతమున బ్రహ్మ మరల సృష్టికుపక్రమించి కలియుగములో ధర్మాన్ని స్థాపన చేయాలని శ్రీమహావిష్ణువు కృష్ణను భూలోకానికి తెచ్చి సత్యాముని తపః ఫలముగా కృష్ణుడు కృష్ణగా సహ్యాద్రి నుండి ఆవిర్భవిస్తుంది.  కృష్ణుడు శ్వేతాశ్వత్థము(రావి చెట్టు) అయి ఆ సహ్యాద్రిపై అధివసిస్తాడు. (సహ్య పర్వతము పడమటి కనుమలలో కలదు.) కృష్ణ ఆ వృక్షాంతర్భాగమున పుట్టినదై భూమిపై ప్రవహించి తన ఉభయ పార్శ్వములందు అనేక తీర్థ రాజములను (క్రౌంచ తీర్థము - అమరావతి) దాటుతూ 800 మైళ్ళు ప్రవహించి సాగరమును చేరుచున్నది.

"శ్రీకృష్ణవేణీ తట ధాన్యవాట్యాం
ఇంద్రేణ దేవ్యాస్సహ సంప్రతిష్టితం
విష్ణ్వ బ్దదై రమరై రభేష్టితం
క్రౌంచమరేంద్రం కలయామి నిత్యం"
~ డా.దీవి దీక్షితులు ~

కృష్ణానది పుట్టినది మొదలు సాగరముతో సంగమమయేంతవరకూ నదికి ఇరువైపులా 800 మైళ్ళ దూరము కృష్ణాతీరముగా పరిగణింపబడి సాక్షాత్ విష్ణుమూర్తి దేహమైన కృష్ణానది తీరప్రాంతము యావత్తూ ముక్తి ప్రదమని గర్గుడు, కశ్యపుడు మొదలైన దేవతాది మహర్షులు పేర్కొనడము జరిగినది. కృష్ణానది  ఆవిర్భవించినది మొదలు సాగర తీరములో సంగమమయ్యే పర్యంతము 128 తీర్థములు ఏర్పడినవి. వానిలో ఆంధ్రప్రాంతములోని శ్రీశైలములో పాతాళగంగ తీర్థము, వేదాద్రిలోని నృసింహ సాలగ్రామ తీర్థము, అమరావతిలోని క్రౌంచ తీర్థము (ఇది అమరావతికి తూర్పుగా 8 మైళ్ళ దూరములో గలదు. ఇచ్చట కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించును) విజయవాడ నందు దుర్గా తీర్థము, శ్రీకాకుళము నందు ముక్తి క్షేత్ర తీర్థము, మోర్తోట వద్ద వేణీ సాగర సంగమ తీర్థము ప్రఖ్యాతి గాంచిన తీర్థములు. కృష్ణాతీరమందున్న ఈ తీర్థములందు స్నానమాచరించి సత్కర్మ లాచరించు మానవులు జీవన్ముక్తులగుదురని పురాణోక్తి. శ్రీశైలానికి ఈశాన్య భాగములోను, కృష్ణానది దక్షినపు గట్టున త్రిలోక ప్రసిధ్ధమైన అమరేశ్వర తీర్థము ఉత్తమమైనది. ఈ క్రౌంచ తీర్థమునందు నూరుకోట్ల తీర్థములున్నందున ఇది సిధ్ధి క్షేత్రము అని అందురు. తీర్థ స్నాన మాచరించి అమరేశ్వరుని దర్శించిన మాత్రముననే వేయి గోవులు దానమిచ్చిన ఫలములతోపాటు పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనము.

పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ్రా నక్షత్రము, ఆదివారము, సంక్రాంతి పర్వదినములు సూర్యచంద్ర గ్రహణములందు, సప్తమీ సోమవారము వైదృతికాగమనమునకు, దక్షిణోత్తరాయనములందు ఈ తీర్థములందు స్నానమాచరించి అమరేశ్వరుని సేవించిన వారికి సహస్ర యఙ్ఞ ఫలితము లభించగలదు.  

ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ, అగస్తేశ్వరుడనీ, కోసలేశ్వరుడనీ, సోమ్యేశ్వరుడనీ, పార్థివేశ్వరుడనే పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుచున్నాడు. ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రములో మూడు రోజులు నివసించి కృష్ణాతీర్థములో స్నానమాచరించి అమరేశ్వరుని కొల్చినవారు మరణానంతరము శివసాయుజ్యము పొందుదురు.  

 

ఆలయ విశేషములు:
1. మూడు ప్రాకారములు
2. నాలుగు దిక్కుల నాలుగు ధ్వజ స్థంభములు
3. దక్షిణ ద్వారములో ముఖ మండపము
4. తూర్పు ద్వారమునకెదురుగా కృష్ణానది
5. పంచాయతన క్షేత్రము (అంబిక, గణపతి, సూర్యనారాయణ, శ్రీ మహావిష్ణ్వాంశ వేణుగోపాలస్వామి)
6. క్షేత్రపాలకుడు కాలభైరవుడు
7. శివకేశవుల కభేద్యము
8. మూలవిరాట్ అమరేశ్వరస్వామి 36 అడుగుల ఎత్తైన లింగాకార రూపము. పై అంతస్థులో 9 అడుగుల ఎత్తులో శ్వేత లింగాకృతిగా ఉండగా మిగిలిన 23 అడుగులు క్రింది అంతస్థులో గోడకట్టి మూసివేయబడినది.

సశేషము...  

ఆధారము: డా.చల్లా సత్యవాణి గారి "పంచారామ క్షేత్ర దర్శిని"

1 comment: